Welcome to ChimataMusic Discussion Board
Let us keep all the Telugu Melodies Alive through Healthy Discussions


 FAQFAQ   SearchSearch   MemberlistMemberlist   UsergroupsUsergroups   RegisterRegister 
 ProfileProfile   Log in to check your private messagesLog in to check your private messages   Log inLog in 

Abheri Ragam

 
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Miscellaneous Topics on Telugu Melodies
View previous topic :: View next topic  
Author Message
Surya
Site Admin


Joined: 02 May 2006
Posts: 458

PostPosted: Wed Jan 09, 2008 1:03 pm    Post subject: Abheri Ragam Reply with quote

రాగలహరి: అభేరి వ్యాసాలురచన : విష్ణుభొట్ల లక్ష్మన్న
(క్రిందటి సంచికలో చేసిన మోహనం రాగం పరిచయం చాలామంది శ్రోతపాఠకులు, ముఖ్యంగా శాస్త్రీయ సంగీతంలో బాగా ప్రవేశమున్న కొంతమంది మిత్రులు, ఈ సంగీత వ్యాసాలు మరింత తేలికగా అందరికీ అర్ధం కావటానికి వీలుగా కొన్ని సూచనలు చేసారు. వారిచ్చిన కొన్ని సూచనలను ఈ వ్యాసంలో ఉపయోగించుకున్నాను. రాగ లక్షణం మరింత అర్ధం కావటానికి వీలుగా
అభేరి రాగాల అరోహణ, అవరోహణ RealPlayer లో ఇస్తున్నాం. ఈ సూచన చేసి, ఇందుకు తోడ్పడిన శ్రీ కొడుకుల శివరాం గారికి ధన్యవాదాలు.

మన సంగీతంలో రాగాల ప్రాధాన్యత గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. భారతీయ సంగీతం, రాగాలు ఒకటి విడిచి మరొకటి లేదు! హిందూస్తానీ సంగీతం కాని, కర్ణాటక సంగీతం కాని, గాత్రం కాని, వాయిద్యాలపై కాని,ఆలాపన, ఖయ్యాల్‌, కీర్తన ఏదైనా కాని సంగీతంలో ఆనందానికి మూలకారణం రాగం. ఆలాపనలో ఏ సాహిత్యం లేకపోయినా, ఖయ్యాల్‌, పల్లవిలలో సాహిత్యం కొంత మాత్రమే ఉన్నా, భజనల్లోనూ, కీర్తనల్లోనూ ఎంతో సాహిత్యం ఉన్నా రాగాల ద్వారానే రసికులైన శ్రోతలను ఆకట్టుకోవటం జరుగుతుంది.

ఏ రాగానికైనా ఆరొహణలోకాని, అవరోహణలో కాని కనీసం ఐదు స్వరాలకి తక్కువ కాకుండా రాగాన్ని నిర్వచిస్తారు. అయితే, సంగీతంలో భావం లేకుండా, స్వరాలు మాత్రం నిర్దుష్టంగా పలికించినంత మాత్రాన రాగ స్వరూపాన్ని తెలియ చెప్పలేరు. అందుకే, రాగం యొక్క భావాన్ని నరనరాల్లోనూ జీర్ణించుకొంటే తప్ప, రాగ స్వరూపం అర్ధం కాదు. కొత్తగా సంగీతం మీద అభిరుచి పెంచుకొనేవారికి అందుకే రాగం అర్ధం కావటానికి సమయం పడుతుంది. సంగీతంపై అభిమానం,అభిరుచి ఉన్నవారు, వీలు కలగ జేసుకొని ప్రఖ్యాత సంగీత విద్వాంసుల కచ్చేరీకి వెళ్ళి వినటం చూస్తే, సంగీతం గురించి తెలియని వారికి అదొక వేలం వెర్రిలా అనిపిస్తుంది కానీ సంగీత ప్రియులకి ఇలా వినటం ఒక అవసరం.

ఈ వ్యాసాల ద్వారా రాగాలను పరిచయం చెయ్యటంలో చాలా వివరాలు వదిలేయటం జరిగింది. ఉదాహరణకు, సంగీతంలో ఒక ముఖ్యభాగమైన “తాళం” గురించి చెప్పలేదు! అలాగే కొన్ని సాంకేతిక వివరాలు కావాలనే వదిలేసాను. అందుకు ముఖ్య కారణం, శ్రోతపాఠకులకు musicology వివరాలవల్ల అసలు విషయం మరుగున పడిపోతుందన్న భయం వల్ల కొంత, సులభ శైలిలో సంగీతాన్ని పరిచయం చెయ్యాలనే తాపత్రయం వల్ల కొంత, మొత్తం మీద కావాలనే చాలా వివరాలు వదిలేసాను. ఉత్సాహం, ఆసిక్తి ఉన్నవారు ఆ వివరాలు తామే తెలుసుకొనే ప్రయత్నం చేస్తారని నా ఆశ.)

అభేరి రాగం ఆధారంగా / దగ్గరగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు

1. ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
4. వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)
5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)
6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)
7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)
8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)
9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌)
10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క)
11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)
12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)
13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)
14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)
15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)
16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)
17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)
18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)
20. ఉయ్యాల జంపాల లూగరావయా… (చక్రపాణి)
21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)
22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)
23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌)
24. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ప్రైవేటు రికార్డ్‌)
25. హాయమ్మ హాయి మా పాపాయి… (ప్రైవేటు రికార్డ్‌ )
26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌)
27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌)
28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)
29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)
30. తెలవారదేమో స్వామీ (శృతిలయలు)

మన సంగీతంలో మరొక ప్రసిద్ధ రాగం అభేరి. క్రిందటి వ్యాసంలో పరిచయం చేసిన మోహనం రాగం లాగే అభేరి కూడా నిర్దుష్టమైన రూపం, రసం ఉన్న రాగం. కరుణ, భక్తి రసాలు ప్రధానంగా ఉన్న ఈ రాగంలో సృజన ( creativity ) కి అవకాశం ఎక్కువ.

స్వరస్థానాలు పరిచయం

క్రిందటి వ్యాసంలో పరిచయం చేసిన మోహనం రాగానికి ఇచ్చినట్టే ఈ వ్యాసంలో కూడా అవసరమైన స్వరస్థానాలు మళ్ళీ అలాగే ఇస్తున్నాను. ఏదైనా ఒక రాగం గురించి తెలుసుకొని, గుర్తు పెట్టుకోవాలంటే, స్వర జ్ఞానం అవసరం. సప్త స్వరాలైన ” స, రి, గ, మ, ప, ద, ని ” స్వరాలలో మూల స్వరాలైన “స, ప” లను మినహాయిస్తే, మిగిలిన ఐదు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి రెండు స్వర స్థానాలున్నాయి. అందువల్ల, సప్త స్వరాలకి 12 స్వర స్థానాలున్నాయి. అవి వరుసగా,

స్వరము కర్ణాటక పద్ధతి హిందూస్తానీ పద్ధతి
సంకేతము

స షడ్జమం షడ్జ

రి శుద్ధ రిషభం కొమల్‌ రిషభ
రి 1
రి చతుశృతి రిషభం తీవ్ర రిషభ
రి 2
గ సాధారణ గాంధారం కొమల్‌ గాంధార
గ1
గ అంతర గాంధారం తీవ్ర గాంధార
గ2
మ శుద్ధ మధ్యమం కోమల్‌ మధ్యమ
మ1
మ ప్రతి మధ్యమం తీవ్ర మధ్యమ
మ2
ప పంచమం పంచమ

ద శుద్ధ ధైవతం కోమల్‌ ధైవత
ద 1
ద చతుశృతి ధైవతం తీవ్ర ధైవత
ద 2
ని కైశిక నిషాధం కోమల్‌ నిషాద
ని 1
ని కాకలి నిషాధం తీవ్ర నిషాద
ని 2

మొత్తం పన్నెండు స్వరాలని వరుసగా ” స, రి 1, రి 2, గ 1, గ 2, మ 1, మ 2, ప, ద 1, ద 2, ని 1, ని 2 ” గా వ్రాసినట్టయితే, అభేరి ఉపయోగించే స్వరాలు ” స, రి2, గ 1, మ1, ప, ద 2, ని1 “. ఇది ఔడవ సంపూర్ణ (ఐదు ఏడు స్వరాల) రాగం. అంటే, ఆరొహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు ఉపయోగించే రాగం. ” స గ మ ప ని స స ని ద ప మ గ రి స ” లాగా ఉపయోగించే రాగం.

ఇంతకుముందు చెప్పినట్టు, మొత్తం 12 స్వరస్థాయిలని దృష్టిలో పెట్టుకొని చూస్తే, హార్మోనియం పై అభేరి రాగాన్ని ఈ క్రింది విధంగా పలికించ వచ్చు.

ఆరోహణ స X X గ1 X మ1 X ప XX ని1 X స
అవరోహణ స X ని1 ద2 X ప X మ1 X గ1 రి2 X స

ఆరోహణలో “స” నుంచి “గ” కు వెళ్ళేటప్పుడు, తిన్నగా “గ” కు వెళ్ళకుండా “స” నుంచి ముందు “మ” చేరి క్షణ కాలంలో “గ” ను చేరాలి. అలాగే, “ప” నుంచి “ని” చేరేటప్పుడు ముందు “స” చేరి క్షణ కాలంలో “ని” చేరాలి. అంటే, ఆరోహణని ఈ విధంగా పలకాలి. “స, మగ, మప, సని, సా”.

అదేవిధంగా, అవరోహణలో “స, సనినీ, నిద దపా, పమ, మగగా గరి,రిసా” లాగా పలకాలి.

శ్రీ కొడుకుల శివరాం ఇచ్చిన ఈ ఆరోహణ, అవరోహణ వినండి! మన కర్ణాటక సంగీతం పద్ధతిలో ఇక్కడ మొదలైన “స” స్వరం శృతి “ఒకటి”. అదే, వెస్టర్న్‌ కీబోర్డ్‌ పద్ధతిలో, ” C” scale కి సమానం. అవకాశం ఉన్నవారు ఈ స్వరాలు వింటూ, కీబోర్డ్‌ మీద స్వరాలు ఇలాగే పలికించండి.

కర్ణాటక సంగీతంలోని 20వ మేళకర్త “నట భైరవి” నుంచి జనించిన రాగం అభేరి. మహ మహోపాధ్యాయ డా. నూకల చినసత్యనారాయణ ” రాగ లక్షణ సంగ్రహం” పుస్తకంలో రాసిన ప్రకారం, 50 ఏళ్ళ క్రితం ఈ రాగం శుద్ధ ధైవతం (హిందూస్తానీలో కోమల్‌ దైవతం) లో పాడేవారట! రాను రాను చతుశృతి ధైవతం (హిందూస్తానీలో తీవ్ర దైవతం) ఉపయోగించటం వల్ల రాగం వినటానికి ఆహ్లాదంగా ఉండటం గుర్తించిన తరువాత, అభేరిలో చతుశృతి ధైవతం స్థిరపడి పోయింది.ఇప్పుడు ప్రచారంలో ఉన్న ” నగుమోము కనలేని..” అన్న ప్రసిద్ధ త్యాగరాజ కృతి (కర్ణాటక సంగీతంలో
త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజు, అభేరి రాగంలో ఈ ఒక్క కృతి తప్ప మరే కృతులు మనకివ్వలేదు!), మొదట ప్రవేశ పెట్టిన పద్ధతి కన్నా, హిందీస్తానీ సంగీతంలో అభేరికి దగ్గరైన భీంపలాస్‌ రాగానికి దగ్గరగా ఉంటూంది. ఈ నాడు ప్రచారంలో ఉన్న అభేరి రాగంలోని స్వరాల ప్రకారం, అభేరి 22వ మేళ కర్త అయిన “ఖరహర ప్రియ” కు జన్య రాగంలా అనిపిస్తుంది.
అందువల్ల, హిందూస్తానీ సంగీతంలోని ధన్యాసి, భీంపలాస్‌ రాగాలు అభేరి పాత,కొత్త పద్ధతుల్ని వరుసగా పోలి ఉంటాయి.

పైన చెప్పిన అభేరి రాగంలోని మార్పు, కాలక్రమంలో రాగాలలో వచ్చిన మార్పులకి ఒక ఉదాహరణ మాత్రమే! నిజానికి కొన్ని వందల ఏళ్ళ క్రిందట ప్రచారంలొ ఉన్న రాగాలు ఇప్పుడు లేవు. కాలానుగుణంగా కొన్ని రాగాలు మరుగున పడినా, సృజనాత్మకత కలిగిన విద్వాంసుల వల్ల, మరి కొన్ని కొత్త రాగాలు మన సంగీతంలో చోటు చేసుకొని సుసంపన్నం చేసాయి. పట్‌దీప్‌,చంద్రకౌన్స్‌, మారుబేహాగ్‌, కళావతి, మధువంతి, శివరంజని వంటి రాగాలు హిందుస్తానీ సంగీతంలో మొన్నమొన్ననే వచ్చిన కొన్ని కొత్త రాగాలు. ఒక వేళ అప్పుడూ, ఇప్పుడూ కూడా చాలా పాప్యులర్‌ అయిన అభేరి వంటి రాగాలు ఉన్నా, ఇందాక చెప్పినట్టు ఈ రాగాలు కాలంతో మారాయి. ఈనాడు మనకున్న రికార్డింగ్‌ సౌకర్యం వల్ల, ఇప్పుడు ప్రచారంలో ఉన్న రాగాలు, వాటి లక్షణాలు మనం రికార్డ్‌ చేసి ముందు తరాలవారి కోసం దాచి ఉంచే వీలు మనకుంది. కానీ, మొన్న మొన్నటి
దాకా ఇటువంటి వీలు లేక పోవడం వల్ల, సంగీతం నేర్పే విద్వాంసులు,వీలైనంత వరకు యధాతధంగా ఒక తరం నుంచి మరొక తరానికి, పూర్తిగా సాధన, జ్ఞాపక శక్తి మీద ఆధారపడి, సంగీతాన్ని పరంపరలుగా నిలుపుతూ వచ్చారు. ఇదే మన సంగీతంలోని సాంప్రదాయం! సహజంగా ఇటువంటి ప్రయత్నాలలో సంగీతం చాలా మార్పులు చెందే అవకాశం ఉండడంవల్ల, సంగీత విద్వాంసులు నిర్దిష్టమైన సంగీత సాంప్రదాయాలను అనుసరించి, సద్గురుశిష్య పరంపరలుగా విద్యను యధాతధంగా మనకు అందించటం జరిగింది.

హిందూస్తానీ సంగీతంలో…

కర్ణాటక రాగం “అభేరి” కి హిందూస్తానీ సంగీతంలో దగ్గరైన రాగం “భీంపలాస్‌”. క్రిందటి వ్యాసం “మోహనం” లో ఇచ్చిన, హిందూస్తానీ, కర్ణాటక పద్ధతుల్లోని పోలికలు తేడాలతో పోలిస్తే, అభేరి, భీంపలాస్‌ రాగాలు ఒకటికి మరొకటి చాలా దగ్గరగా ఉంటాయి. భీంపలాస్‌ రాగం, “భీం”,”పలాస్‌” అన్న రెండు రాగాల కలయిక అంటారు కొంతమంది. మరికొందరు, ఈ రాగం
అసలు పేరు “పలాస్‌”, దానికి భీమ్‌ అన్న విశేషణం తరవాత కలిపారు అంటారు ( ఈ రాగం గొప్పది కాబట్టి, శంకరాభరణం రాగాన్ని ధీరశంకరాభరణం అన్నట్టు, “పలాస్‌” కి ముందు “భీమ్‌” అన్నది కలిపారని కొందరి వాదన). హిందూస్తానీ సంగీతంలో చాలా ప్రాచుర్యం పొందిన ఈ భీంపలాస్‌ రాగం,మరాఠీ స్టేజి మీద చాలా ముఖ్యమైన రాగం. అభేరి రాగానికి ఉన్నట్టుగానే భీంపలాస్‌ రాగానికి కూడా ఆరోహణఅవరోహణ “స గ మ ప ని స స ని ద ప మ గ రి స”. ఈ రాగానికి వాది స్వరం “మ”, సంవాది “స”. కర్ణాటక పద్ధతిలో వాదిసంవాదిల ప్రసక్తి ఉన్నా, వీటిని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టు కనపడదు. భీంపలాస్‌ రాగం “ని స మ” అన్న స్వరాలతో మొదలు పెట్టటం చాలా విన సొంపుగా ఉంటుంది. “మ గ” అన్న సంగతి వాడకం ఈ రాగంలో ఎక్కువ. భీంపలాస్‌ పకడ్‌ (స్వరాల గుంపు) ఈ విధంగా ఉంటుంది.

ని స మ S S మ ప గ మ గ రి స

పైన చెప్పిన పకడ్లో S అన్న గుర్తు దీర్ఘ స్వరాన్ని తెలియచేస్తుంది.అంటే, “ని స మ” అన్నప్పుడు “మ” మీద దీర్ఘం తీయటం వల్ల, “ని స మా”గా మారుతుంది. భీంపలాస్‌ పూర్వాంగ రాగం. మొత్తం పన్నెండు స్వరస్థానాలని రెండు గ్రూప్‌లుగా విడకొట్టి, స నుంచి ప వరకు ఒక గ్రూప్‌, ప నుంచి పై స వరకు రెండవ గ్రూప్‌ అనుకుంటే, ఏ రాగంలో స్వరాల సంచారం మొదటిగ్రూప్‌ మీద ఎక్కువగా ఉంటుందో అది పూర్వాంగ రాగం. రెండో గ్రూప్‌ మీద ఆధారపడేది ఉత్తరాంగ రాగం అవుతుంది.

సినిమా పాటల పరిచయం ముందు, ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసుడు స్వర్గీయ మల్లికార్జున్‌ మన్సూర్‌ పాడిన ఈ భీంపలాస్‌ రాగం వినండి. మొత్తం 30 నిమిషాలుకు పైగా సాగే ఈ గానం, ఈమాట పాఠశ్రోతలకు ఒక ఉదాహరణగా ఈ రాగం ఛాయల్ని వినిపించటం కోసం, ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తున్నాం! శాస్త్రీయ సంగీతం వినటం ఎక్కువగా అలవాటు లేనివారికి ఒక సూచన. సినిమా పాటలు, ఇతర లలిత గీతాలూ ఇచ్చినంత తొందరగా ఆనందం శాస్త్రీయ సంగీతం ఇవ్వదు కాబట్టి, ప్రశాంతంగా ( inhibitions ఏమీ లేకుండా)ఈ రాగం వినండి. వినగా, వినగా మీ మనస్సుల్లో అభేరి లేకపోతే భీంపలాస్‌ రాగాల్లో బాణీలు కట్టిన ఎన్నో పాటలు గుర్తుకు వస్తాయి. కొంచెం రాగాలతో పరిచయమున్నవారుి, ఇక్కడ ఇచ్చిన రాగాలాపనలో, రాగం ఎలా evolve అవుతుందో గమనించగలుగుతారు. నెమ్మదిగా మంద్ర స్థాయిలో మొదలు పెట్టిన ఈ గానం, రాను రాను రాగాలాపనలోనూ, గమనంలోనూ వేగం పుంజుకొని మిమ్మల్ని ఎక్కడకో లాక్కుపోతుంది. ఇలాంటి ఉదాహరణల వల్ల సినిమాపాటలకి,శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడాలు, పోలికలు కూడా తెలుస్తాయి. స్వర్గీయ మన్సూర్‌ గొంతులో ఒకరకమైన “జీర” మొదట మీకు వినిపించినా, త్వరగా అది మీరు మర్చిపోయి రాగంలో పడిపోతారు!

సినిమా పాటలు

తెలుగు సినిమా పాటల్లో, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి అతి దగ్గరగా బాణీ కట్టి, పాప్యులర్‌ అయిన పాట, శ్రీమతి ఎస్‌. జానకి మురిపించే మువ్వలు సినిమాకోసం పాడిన “నీ లీల పాడెద దేవా..” అన్న పాట. ఈ పాట ఇప్పటికీ తెలుగు వారి నాలుకల మీద ఆడుతూనే ఉంది. తమిళంలో కూడా ఈ పాట గొప్ప ప్రజాదరణ పొందింది. శ్రీమతి జానకి గొంతు ఈ పాటకి ఎంత బాగా సరిపోయిందో,గాత్రానికి మించి సన్నాయి పై సహకారం అందించిన శ్రీ కరైక్కుడి అరుణాచలం వాద్య సహకారం అంత కంటే ఇంకా చక్కగా ఉంది. పాట మొదట్లో జానకి గొంతు, నాదస్వరం స్వరం విడివిడిగా గుర్తు పట్టగలిగినా, పాటలో వేగం పెరిగిన
తరువాత, గాత్రంనాదస్వరం ఒక్కసారే వినిపిస్తున్నపుడు, ఈ రెంటికీ తేడా తెలియకుండా పోతుంది.

తెలుగువారి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల చాలా సినిమాల్లో అభేరి రాగాన్నివాడటమే కాకుండా, ప్రైవేటు రికార్డుల్లో స్వరం ఇచ్చిన పాటల్లో “రావోయి బంగారి మామా నీతోడి రాహస్య మొకటున్నదోయి..” అన్న పాట అభేరి రాగంలో కట్టినదే! పాట వింటూ ఉంటే, ఒక పల్లెటూరి వాతావరణం సంగీతంలో సృష్టి చేసాడు ఘంటసాల.మూడవచరణం లో మొదలైన “ఏటి పడవ సరంగు పాట గిరికీలలో….” తరవాత వచ్చే గమకాలు, ఆల&
Back to top
View user's profile Send private message
Surya
Site Admin


Joined: 02 May 2006
Posts: 458

PostPosted: Tue Sep 09, 2008 10:51 pm    Post subject: Reply with quote

తెలుగువారి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల చాలా సినిమాల్లో అభేరి రాగాన్నివాడటమే కాకుండా, ప్రైవేటు రికార్డుల్లో స్వరం ఇచ్చిన పాటల్లో “రావోయి బంగారి మామా నీతోడి రాహస్య మొకటున్నదోయి..” అన్న పాట అభేరి రాగంలో కట్టినదే! పాట వింటూ ఉంటే, ఒక పల్లెటూరి వాతావరణం సంగీతంలో సృష్టి చేసాడు ఘంటసాల.మూడవచరణం లో మొదలైన “ఏటి పడవ సరంగు పాట గిరికీలలో….” తరవాత వచ్చే గమకాలు, ఆలాపనలో లలితంగా ఒక folk tune వినిపించటమే కాకుండా, సుశాస్త్రీయంగా కూడా అభేరి రాగానికి న్యాయం చేకూర్చాడు. సాహిత్యంలో ఇది అచ్చంగా ఒక తెలుగుపాట. సంగీతంలోనూ ఇది అంతకంటే మరీ అచ్చమైన తెలుగు పాట.

గుండమ్మ కధ సినిమాలో ఎన్నో పాటలు పాప్యులర్‌ అయ్యాయి. “ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..” అన్నపాట తెలియని తెలుగువారు బహుశా ఉండరేమో! ఒక పాట బాణీ కాపీ కొట్టి మరొక పాటలో వాడుకున్న సందర్భాలు
మన సినిమా పాటల్లొ ఎన్నో ఉన్నాయి. కానీ, ఇళయ రాజా డిటెక్టివ్‌ నారద అన్న సినిమాలో ఈ పాటను పూర్తిగా ఉపయోగించుకుంటూనే “యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ..” అని చిత్ర గొంతుతో మొదలయ్యే ఈ పాట ఒక అద్భుత సృష్టి. ఇళయరాజా creativity మళ్ళీ ఈ పాటలొ మరోసారి చూపించాడు. ఈ పాటలో వాడుకున్న వాయిద్యాలు, వాటి ఆర్కెస్ట్రేషన్‌ మళ్ళి ఇంకోసారి వినండి.

అభేరి రాగంలో ఆరోహణ స్వరాల్ని అలాగే వాడుతూ, అవరోహణలో మాత్రం “ద,రి” లను వాడకుండా,అంటే అరోహణలోనూ అవరోహణలోను కూడా “స గ మ ప ని” స్వరాలనే వాడుతూ శ్రీమతి లీలచే పాడిచిన దేవులపల్లి సాహిత్యం “సడిసేయకో గాలి సడి చేయబోకే ..” అన్న పాటను రాజమకుటం సినిమాకోసం మాస్టర్‌ వేణు స్వరపరిచాడు. పాట మొదలవుతూనే వినే ఆలాపన ఎంత అద్భుతంగా ఉందో, చరణాల మధ్య వచ్చే క్లారినెట్‌ వాయిద్యం అందుకు సమానంగా ఉంది.
ఈ పాట శ్రద్ధగా వింటే, అభేరి రాగ లక్షణాలు ఈ పాటలో తక్కువగా వినపడ్తాయి. అందుకు ముఖ్యకారణం, ఇందాకా చెప్పినట్టు “రి, ద” లను వాడకపోవటమే! ఈ పాటలోని సాహిత్యం సంగతి సరే సరి! శ్రీమతి లీల పాడిన “ఆనాటి” పాటల లిస్టు ఎవరన్నా తయారు చేస్తే, ఆ లిస్టులో ఈ పాట తప్పకుండా ముందు ఉండాల్సిన పాట.

చివరిగా, “ఈనాటి” పాటల్లో అభేరిలో స్వరం చేసిన ఒక పాటతో ఈ వ్యాసం ముగిస్తాను. శృతిలయలు సినిమా కోసం కె. వి. మహాదేవన్‌ సంగీతం ఇచ్చిన “తెలవారదేమో స్వామీ..” అన్న పాట అభేరిలో స్వరపరచిందే! పాట వింటూ ఉంటే “నగుమోము కనలేని..” అన్న త్యాగరాజ కీర్తన ఛాయలు కనపడతాయి.ఈ పాట గురించి ఎక్కువ చెప్పక్కరలేదు. ఎందుకంటే, సినిమా సంగీతంలో ఎన్నో గొంతులు వినిపిస్తూ ఉన్నా, జేసుదాసు గొంతుకి ఒక ప్రత్యేకత ఉంది.శాస్త్రీయ సంగీత జ్ఞానంతో పాటు, లలిత సంగీతం, వీటన్నిటికీ మించి ఏ సంగీతాన్నయినా “సంగీతం”గా వినిపలికించగలిగే గొంతు జేసుదాస్‌ది!

“నన్నుదోచుకుందువటె వన్నెల దొరసాని” స్వరాలు

Opening

సగమపనీసా నీపామానీదాపా… మాగారీనీసా నీగారీసా…

Male
నన్నుదోచుకుందువటె వన్నెల దొరసాని
సారిసనిసనిసాసాసా సాపమపమ గమామా
Female
కన్నులలో దాచుకొందు
గామాపాసా నీదపామ
నిన్నేనా స్వామీ నిన్నేనా స్వామీ
పదమప రీగాగా పదమప సారిసనిప

Male
నన్నుదోచుకుందువటె
సారిసనిసనిసాసాసా

మొదటి చరణం ముందు సంగీతం

దాదా సారిస దాసద పాగా
పాపా దాపద పాదప గాపగ రీసా
రీరీ గాపగ రీసా రీదసా పగరిసా

మొదటి చరణం ముందు స్వరాలు

సాగాపాసా పనిసగరినిసా సగమదపమగా
గమపసనిద సగమదపమ గారీసా

Female
తరియింతును నీచల్లని చరణమ్ముల నీడలోన
నిసమగగరి నిసరిససా నిసమగగరి సిసరిససా

Music గమామపమ గమగరిస

పూలదండవోలె కర్పూరకళికవోలె కర్పూరకళికవోలె
సామపమమగామా మసాగమపమమామా గగపమగమగరీసా

Music గామా పనిసా గరిసా

Male ఎంతటినెరజాణవొ నా అంతరంగమందునీవు
పాపనిని నీసారిససస సరిసనిస నిసనిసగరినిససససా

Music నిరిసా నిరిసా నిపసా

Male కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు
దదదాదా నీసనిదప పమమపపపపపా పమగమగరిగరిసాసా

నన్నుదోచుకుందువటె

Music గమపనిసా నిరిసనిపమగస

రెండవ చరణం చరణం ముందు స్వరాలు

సాగాపా సరిగమపా… నిదపమపా… దపమగమా…
దపమగమా పమగరిగా మగరిస సానీపాసా…

రెండవ చరణం పాట స్వరాలు ప్రయత్నించి కనుక్కోండి

Female నామదియే మందిరమై

Music పనిప నిసని సగరినిసా

Female నీవే ఒక దేవతవై

Music మపమ గమగ రిగరినిసా

Female వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో

Music గామా పనిసా గరిసా

Male ఏనాటిదొ మన బంధం ఎరుగరాని అనుబంధం

Music నిరిసా నిరిసా నిపసా

Male ఎన్నియుగాలైనా ఇది చెదిరిపోని బంధం ఇగిరిపోని గంధం

Music గమపనిసా నిరిసనిపమగస
Back to top
View user's profile Send private message
Display posts from previous:   
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Miscellaneous Topics on Telugu Melodies All times are GMT + 9 Hours
Page 1 of 1

 
Jump to:  
You cannot post new topics in this forum
You cannot reply to topics in this forum
You cannot edit your posts in this forum
You cannot delete your posts in this forum
You cannot vote in polls in this forum


Powered by phpBB © 2001, 2005 phpBB Group